ముందస్తు బెయిల్ కోరిన 'హనీప్రీత్'

Header Banner

ముందస్తు బెయిల్ కోరిన 'హనీప్రీత్'

  Mon Sep 25, 2017 21:46        India, Telugu

డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ దత్తత పుత్రిక హనీప్రీత్ ఆచూకీ కోసం పోలీసులు ఓవైపు జల్లెడ పడుతుండగా, మరోవైపు హనీ ప్రీత్ తరఫు లాయర్ ఆమెకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును సోమవారంనాడు ఆశ్రయించారు. ఈ విషయాన్ని హనీప్రీత్ తరఫు లాయర్ ప్రదీప్ కుమార్ ఆర్య తెలిపారు. ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై సత్వర విచారణ జరపాలంటూ తాము కోరామని, యాక్టింగ్ చీఫ్ జస్టిస్ గీతా మిట్టల్ ముందుకు ఇది మంగళవారంనాడు విచారణకు వచ్చే అవకాశముందని ఆయన ప్రదీప్ కుమార్ చెప్పారు. డేరా బాబా రామ్ రహీమ్ సింగ్‌ను సీబీఐ కోర్టు దోషిగా ప్రకటించిన అనంతరం ఆయనను తప్పించేందుకు హనీప్రీత్ ప్రయత్నించిందని, తీర్పు అనంతరం 41 మంది మృతికి కారణమైన అల్లర్లను ఆమె రెచ్చగొట్టారని హర్యానా పోలీసులు ఆరోపిస్తున్నారు. ఆమె ఆచూకీ తెలియకపోవడంతో లుక్ ఔట్ నోటీసులు కూడా జారీ చేశారు. నేపాల్ సరిహద్దులు, ముంబై తదితర ప్రాంతాల్లో గాలింపులు కూడా జరిగాయి. ఆసక్తికరంగా, హనీప్రీత్ ముందస్తు బెయిల్‌ కోసం ఢిల్లీ హైకోర్టులో దరఖాస్తు చేసుకున్న సోమవారంనాడే రామ్ రహీమ్ సైతం అత్యాచారం కేసులో సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ పంజాబ్, హర్యానా ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు.   ముందస్తు బెయిల్ కోరిన 'హనీప్రీత్'