10.5 శాతం వృద్ధిరేటు సాధించాం...ముఖ్యమంత్రి చంద్రబాబు

Header Banner

10.5 శాతం వృద్ధిరేటు సాధించాం...ముఖ్యమంత్రి చంద్రబాబు

  Sat Sep 29, 2018 07:59        APNRT, అమరావతి కబుర్లు, India, Technology, Telugu, World

ప్రధాని మోదీ పూర్తిగా విశ్వసనీయత కోల్పోయారని, ఆయన చెప్పే నీతులకూ చేసే పనులకూ పొంతన లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. అన్ని దేశాలు తిరిగొచ్చిన ప్రధాని ఏం సాధించారు? దేశానికి ఏం గుర్తింపు తెచ్చారని నిలదీశారు. రాఫెల్‌ కుంభకోణంపై ప్రధాని ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. ‘మాపై మీకెందుకంత అసూయ? ఎందుకంత కడుపుమంట? చేతగాని, పసలేని విమర్శలు చేస్తూ అంత నీచానికి ఎందుకు దిగజారుతున్నారు? చేతనైతే సాయం చేయండి.. లేకపోతే గమ్మునుండండి’ అని భాజపా నాయకులపై ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ఐక్యరాజ్యసమితి సదస్సులో మాట్లాడేందుకు చంద్రబాబుకు ఆహ్వానం లేదంటూ భాజపా నాయకులు చేసిన ఆరోపణలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వాళ్లను ఏమనాలి? ప్రధాని ఊరూరూ తిరిగొచ్చారు కదా? అన్ని దేశాలు తిరిగారు కదా? ఏం చేశారు? దేశానికి ఏం గుర్తింపు తెచ్చారు? ఏం సాధించారు? సమాధానం చెప్పండి. గతంలోకంటే ఎక్కువ వృద్ధి సాధించారా? చేసిందేమీ లేకపోయినా ఊరికే ఎవరిని విమర్శిస్తారు? డిజిటల్‌ ఇండియా అన్నారు.. ఏం చేశారు? రాష్ట్రాన్ని డిజిటల్‌ ఆంధ్రప్రదేశ్‌గా చేసి నంబరు1గా నిలిచాం. 10.5 శాతం వృద్ధిరేటు సాధించాం. మీ పార్టీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా ఇంత వృద్ధిరేటు ఉందా? సులభతర వాణిజ్యంలో నంబరు1గా ఉన్నాం. కాదంటారా? అత్యంత నివాసయోగ్య నగరాలు, పర్యాటకం, నరేగా, గృహనిర్మాణం ఇలా అనేక రంగాల్లో మేమే అగ్రగామి. మీరు కేవలం విమర్శలు చేయడంలోనే నెం.1. అసూయకూ హద్దుంటుంది. నన్ను విమర్శిస్తే ఓట్లు పడతాయని, ప్రజలను మభ్యపెట్టొచ్చని అనుకుంటే ఉపయోగం లేదు’ అని ఆయన శుక్రవారం ఉండవల్లిలోని ప్రజావేదికలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నాపై అవినీతి ఆరోపణలు చేస్తారా? రాఫెల్‌ కుంభకోణంపై ఏమంటారు? సమాధానం చెప్పే ధైర్యముందా? దేశ రక్షణతోనే ఆడుకుంటారా? మీ ఆర్థికశాఖ కార్యదర్శి వల్లే ఆర్థిక నేరగాళ్లు విదేశాలకు వెళ్లిపోయారని మీ ఎంపీనే చెబుతున్నారు’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘ఐరాస నుంచి నాకు వచ్చిన ఆహ్వానం చూపించాం కదా? యూఎన్‌డీపీ ఐరాసలో భాగం కాదా?’ అని ప్రశ్నించారు. భారతదేశంగానీ, దేశంలోని మరే రాష్ట్రమైనాగానీ గతంలో ఎప్పుడైనా ఐరాస వేదికపై ఇలాంటి వినూత్న విధానాన్ని సమర్పించిందా? అని నిలదీశారు. ‘ఏదైనా ఒక అంశంపై వంద దేశాల్లో ఒక దేశంగా ఐరాసలో మాట్లాడితే మాట్లాడి ఉండొచ్చు. అంతేగానీ మనం అమల్లోకి తెచ్చిన మంచి విధానాన్ని వారే గుర్తించి ఆహ్వానించి ఐరాస వేదికపై వివరించమనడం.. మనం చేసిన పని ప్రపంచానికే ఆదర్శమని చెప్పడం గతంలో ఎప్పుడైనా ఉందా?’ అని ఆయన ప్రశ్నించారు. ‘ప్రపంచంలో ఎస్తోనియా తర్వాత పరిపాలనను సాంకేతికతతో అనుసంధానించిన ప్రభుత్వం ఏదైనా ఉంటే అది మాదే. దానికి మీరేమీ మమ్మల్ని పొగడాల్సిన అవసరం లేదు. మా ప్రజలకు తెలిస్తే చాలు. మా రియల్‌టైం గవర్నెన్స్‌ను చూసి ప్రపంచమంతా పొగుడుతోంది. అది మా బలం’ అని ఆయన భాజపా నాయకులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘పార్టీలకైనా, నాయకులకైనా హుందాతనం ఉండాలి. వాళ్లు రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చారు? వాళ్లకు టెక్నాలజీ గురించి ఏమైనా తెలుసా? దిల్లీలో రెండు విలేకరుల సమావేశాలు పెట్టారని పదవులిచ్చేస్తే.. అదే గొప్పనుకుంటే సరిపోతుందా?’ అని భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావును ఉద్దేశించి సీఎం మండిపడ్డారు.

ఎన్నికలు వస్తే వాళ్ల పని అదే కదా? 
తెలంగాణలో కాంగ్రెస్‌ నాయకుడు రేవంత్‌రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలపై విలేకరులు ప్రస్తావించగా.. ‘అక్కడా ఇక్కడా అని కాదు. దేశమంతా వాళ్లు చేస్తోంది అదే కదా? తమిళనాడు, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్‌ల్లో ఏం జరిగింది? అక్కడ చేసిందీ ఇదేపని. వాళ్లు దొంగల్ని, నేరగాళ్లను పట్టుకోలేరుగానీ రాజకీయ కక్ష సాధింపునకు పాల్పడతారు. నేను ఎవరో ఒకరిద్దరి గురించి మాట్లాడటం లేదు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వాళ్లు అదే చేస్తున్నారు. సమాజానికి, రాజకీయాలకు ఇది మంచిది కాదు’ అని వ్యాఖ్యానించారు. రాఫెల్‌ కుంభకోణానికి నిరసనగా విపక్ష ఎంపీల రాజీనామాల ప్రతిపాదన గురించి ప్రస్తావించగా... ‘రాజీనామాలు చేసి ఇంట్లో పడుకుంటే ఉపయోగం లేదు. పోరాడాలి. రాఫెల్‌పై ప్రధాని ఇంతవరకు ఎందుకు నోరు మెదపలేదు? నేను ఐరాసకు వెళ్లడంపై వారి ఆరోపణలకు సమాధానం చెప్పా. రాఫెల్‌పై వాళ్లనూ చెప్పమనండి’ అని ఆయన వ్యాఖ్యానించారు. మీ సతీమణి పేరుపై రూ.1200 కోట్ల అవినీతి ఆస్తులున్నట్టు వైకాపా ఆరోపిస్తోంది? మీ కుటుంబంపై కేంద్రం క్రిమినల్‌ కేసులు పెడుతుందన్న ప్రచారం జరుగుతోందన్న ప్రశ్నకు.. ‘అవి సాక్షి పత్రిక రాతలే కదా? నాపై క్రిమినల్‌ కేసులు పెడతారా? పెట్టనివ్వండి చూద్దాం. రాజకీయాల్లో నాకు కేసులేమైనా కొత్తా? రాజశేఖర్‌రెడ్డి 26 విచారణ కమిటీలే వేసుకున్నారు? ఏమైంది? నా బలమంతా ఇన్నేళ్లలో సంపాదించుకున్న విశ్వసనీయతే. ఒక అవినీతిపరుడు మురికి కాలువలో ఉండి దారినపోయే వారిపై బురద జల్లాలనుకుంటే కుదురుతుందా? ప్రతి శుక్రవారం కోర్టు బోనులో నిల్చొని బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అతన్ని ఎన్డీయే ప్రభుత్వం కాపాడుతోంది. మనం ఆదర్శంగా నిలిచి వేరే వాళ్లకు చెప్పాలి. రాష్ట్రానికి జరిగిన అన్యాయం సరిదిద్దమని అడిగితే.. నాపై దాడులు చేయడమేంటి?’అని మండిపడ్డారు.

ప్రాణహాని ఉంటే భద్రత కల్పిస్తాం 
‘పవన్‌కల్యాణ్‌ తనకు ప్రాణహాని ఉందని అంటున్నారు. అలా మాట్లాడటం సరికాదు. నిజంగా ఆయనకు సమస్య ఉంటే భద్రత కల్పిస్తాం. ఎవరిపైనైనా అనుమానం ఉంటే చర్యలు తీసుకుంటాం. అంగరక్షకులు వద్దని ఆయనే తిప్పి పంపించారు. పోలీసు వ్యవస్థపై అందరికీ నమ్మకం ఉండాలి. తెదేపాకు ఎప్పుడూ నేరచరిత్ర లేదు. దానికి మేమే బలయ్యాం. నేరపూరిత రాజకీయాలను మేం ఎప్పుడూ ప్రోత్సహించలేదు. పరిటాల రవిని ప్రత్యర్థులు చంపేసినా మేం మాట్లాడలేదు. ఫ్యాక్షన్‌ను, నక్సలైట్లను, మతకలహాల్ని నియంత్రించా. నక్సలైట్లు నాపైనే దాడి చేశారు. నేను గట్టి చర్యలు చేపట్టాకే రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి’ అని ముఖ్యమంత్రి వివరించారు. పెట్రోలు ధర రూ.90కి చేరిందని విలేకరులు ప్రస్తావించగా... ‘లీటరు పెట్రోలు ధర రూ.100కి చేరుతుందని, డాలరుతో రూపాయి మారకం విలువ పడిపోతుందని ఇదివరకే చెప్పా. దేశం ఇంతగా గగ్గోలు పెడుతున్నా వారికేమీ పట్టడం లేదంటే అదేం ప్రభుత్వం?’అని కేంద్రంపై మండిపడ్డారు.

ఐకాస వేదికగా ప్రపంచానికి ఏమిస్తున్నామో చెప్పాం.. 
‘ఐక్యరాజ్యసమితి వేదికగా జమ్ముకశ్మీర్‌, ఉగ్రవాదం ఇతర సమస్యలు చెప్పేవాళ్లం. మొదటిసారి ప్రపంచానికి మనం ఏం ఇవ్వబోతున్నామో తెలియజేశాం. పర్యావరణానికి, ప్రజారోగ్యంలో పెనుమార్పులకు పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం ఎలా దోహదపడుతుందో వివరించాం. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి, ఇక్కడి రైతులకు గొప్ప విజయం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. అమెరికా పర్యటన సందర్భంగా చేసుకున్న కీలక ఒప్పందాలను చంద్రబాబు వివరించారు. డోయర్‌, ట్రైటాన్‌, వి-రిసార్ట్స్‌, ఓవైవో తదితర సంస్థలతో కుదిరిన ఒప్పందాలను వివరించారు.

ఎన్‌ఆర్‌ఐ తెలుగువారికి అయిదు కార్యక్రమాలు 
కొత్తగా ఎన్‌ఆర్‌ఐ తెదేపా విభాగం ఏర్పాటుచేయడంతోపాటు వారికి అయిదు కార్యక్రమాలనిచ్చామని చంద్రబాబు వివరించారు. 
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పట్టణాల్లో వెంకటేశ్వరస్వామి దేవాలయాలను నిర్మించాలి. 
కూచిపూడిని వారసత్వంగా తీసుకెళ్లాలి. 
ఐటీని ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో అనుసంధానించాలి. 
ప్రకృతి వ్యవసాయం ప్రపంచానికే మనం ఇచ్చే బహుమతి. దీన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సహకరించాలి. 
తెలుగువారు ఎక్కడున్నా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి రావాలి. పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి.


   america tour