ఐటీ అభివృద్ధి నగరాల జాబితాలో అమరావతి

Header Banner

ఐటీ అభివృద్ధి నగరాల జాబితాలో అమరావతి

  Wed Oct 10, 2018 07:05        APNRT, Associations, అమరావతి కబుర్లు, India, Technology, Telugu, World


‘కమ్‌ బ్యాక్‌ హోమ్‌!
నైపుణ్యాన్ని వెలికితీయండి
మీ ఉద్యోగానికి మాది భరోసా
హెచ్‌సీఎల్‌ నినాదం ఇది
హెచ్‌సీఎల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌కు భూమిపూజ చేసిన ఐటీ మంత్రి లోకేశ్‌
అమ‌రావ‌తి ః ‘కమ్‌ బ్యాక్‌ హోమ్‌! రాష్ర్టానికి వచ్చేయండి! రాజధానిలో మేం భరోసా కల్పిస్తున్నాం. మీ ప్రాంతంలోనే అత్యుత్తుమ ఐటీ కొలువులు పొందండి!! రాజధాని ప్రాంతంలో అతిపెద్ద ఐటీ ఇండస్ర్టీ హెచ్‌సీఎల్‌ పూరించిన నినాదం ఇది.. అంతర్జాతీయ విమానశ్రయానికి అభిముఖాన కేసరపల్లిలో దేశంలోనే భారీ హెచ్‌సీఎల్‌ ఐటీ క్యాంప్‌సకు సోమవారం రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ భూమిపూజతో ఐటీ నగరాల జాబితాలో అమరావతి కూడా చేరింది. ఒకప్పుడు ఐటీ అంటే బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లు కేంద్రంగా ఉండేవి. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కృషితో నేడు వాటి సరసన అమరావతి సగర్వంగా నిలుస్తోంది. దేశంలో ఏ ఇతర ఐటీ సంస్థకు లేనివిధంగా అతిపెద్ద క్యాంపస్‌ హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ రూపంలో అమరావతి రాజధాని ప్రాంతంలోని కేసరపల్లిలో 27 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఏర్పాటు కావటం విశేషం. అమరావతి రాజధాని ప్రాంతంలో ఐటీ రంగం ఇపుడిపుడే విస్తరిస్తోంది. మంగళగిరి, కేసరపల్లిలు ఇప్పటికే సైబర్‌ వాడలుగా అభివృద్ధి చెందుతున్నాయి.

మంగళగిరిలో పై డేటా సెంటర్‌ అతిపెద్ద ఐటీ ఇండస్ర్టీగా రావటంతో జోష్‌ వచ్చింది. కేసరపల్లిలో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ బిగ్‌ ఐటీ ఇండస్ర్టీ వచ్చింది. విజయవాడ, మంగళగిరి నగరాల్లో ఇప్పటికే చిన్న కంపెనీలు ఏర్పడ్డాయి. విజయవాడ నగరంలోనే ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రాంగణంలో సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌టీపీఐ)ఐటీ, ఐటీయేతర స్టార్టప్స్‌కు ఇంక్యుబేషన్‌ సెంటర్‌ ఏర్పడింది. దీంతోపాటు మరో 60 వేలచదరపు అడుగుల విస్తీర్ణంలో జీ+6 ఐటీ టవర్‌ నిర్మాణం పూర్తికావస్తోంది. రాష్ట్రంలోనే సైబర్‌వాడగా నిలుస్తోన్న కేసరపల్లిలో ఐటీ రంగం విస్తరిస్తోంది. ఏస్‌ అర్బన్‌-ఏపీఐఐసీ హైటెక్‌సిటీలో మేథ టవర్‌లో ఒకప్పుడు రెండు, మూడు ఐటీ పరిశ్రమలు తప్పితే ఏమీ ఉండేవి కావు. ప్రస్తుతం 15 కంపెనీలకు పైగా కొలువుతీరాయి. హెచ్‌సీఎల్‌ భాగ స్వామ్యసంస్థ స్టేట్‌ స్ర్టీట్‌ సంస్థ ఇటీవలే కొలువుతీరింది. ప్రస్తుతం హెచ్‌సీఎల్‌ చెంతన హైదరాబాద్‌లోని గచ్చిబౌలి తరహాలో ఐటీ పార్క్‌కు ఏపీఐఐసీ చర్యలు తీసుకుంటోంది.

ఐటి హ‌బ్‌గా కేసరపల్లి
భారీ ఐటీ ఇండస్ర్టీ హెచ్‌సీఎల్‌ ఏర్పాటుతో కేసరపల్లి సైబర్‌వాడగా అభివృద్ధి చెందుతోంది. హైటె క్‌సిటీ 34ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చెందుతోంది. 29.86ఎకరాల విస్తీర్ణంలో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ అభివృద్ధి చెందనుంది. మరో 66ఎకరాల విస్తీర్ణంలో గచ్చిబౌలి తరహా ఐటీ పార్కుకు శ్రీకారం చుడుతున్నారు. కేసరపల్లిలో విజయవాడ విమానాశ్రయం అభిముఖాన ఒకేచోట 130 ఎకరాల విస్తీర్ణంలో ఐటీ పరిశ్రమ విస్తరిస్తోంది.

హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ స్వరూపం
అమరావతి రాజధాని ప్రాంతంలో హెచ్‌సీఎల్‌ సంస్థ ఐటీ డెవల్‌పమెంట్‌ - ట్రెయినింగ్‌ సెంటర్‌లను ఏర్పాటు చేస్తుంది. రూ.700 కోట్ల వ్యయంతో మొత్తంగా ఈ రెంటుచోట్ల పెట్టుబడులు పెడుతుంది. కేసరపల్లిలో రూ.400 కోట్ల వ్యయంతో గ్లోబల్‌ ఐటీ డెవల్‌ప్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తారు. ఇందులోనే ఆర్‌అండ్‌డీ విభాగం ఉంటుంది. తొలి దశలో నాలుగు వేలకు పైగా ఉద్యోగాలు కల్పించనున్నారు. ఇందులో భాగంగా 1000 మందితో కూడిన ట్రైనింగ్‌ సెంటర్‌ను కూడా నెలకొల్పుతున్నారు.

పెను విప్లవం...ఏపీ ఐటీ రంగంలోనే
- నారా లోకేష్‌ ఐటీ శాఖ మంత్రి
రాష్ట్ర ఐటీ రంగంలోనే హెచ్‌సీఎల్‌ ఏర్పాటు ఒక పెనువిప్లవం. ఇదో చారిత్రాత్మక ఘట్టం. దేశంలోనే అతిపెద్ద ఐటీ క్యాంపస్‌ రాష్ర్టానికి గర్వకారణం. ఐటీ రంగంలో లక్ష ఉద్యోగాలు కల్పించాలన్న మా లక్ష్యానికి హెచ్‌సీఎల్‌ సంస్థ ఎంతో తోడ్పాటునందించింది. హెచ్‌సీఎల్‌ కొత్త శక్తినిచ్చింది. ఈ క్యాంపస్‌ నుంచి నాణ్యమైన సేవలు అందించటం జరుగుతుంది. నాలుగువేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. వెయ్యిమందికి శిక్షణ ఇవ్వటం జరుగుతుంది.

తెలుగు నేర్చుకుంటా..
- శిఖర్‌ మల్హోత్రా, వైస్‌ చైర్మన్‌ హెచ్‌సీఎల్‌
నాకు తమిళం ఇంగ్లీషు వచ్చు. ఏపీలో సంస్థను నెలకొల్పుతున్నందున తెలుగు నేర్చుకోవాలని, తెలుగులో మాట్లాడాలని ఉంది. స్థానికతకు దగ్గరగా ఉండాలన్న ప్రయత్నంతోనే నేను తెలుగు నేర్చుకోవాలనుకుంటున్నాను.

మా కమిట్‌మెంట్‌ చూడండి
- రోషిణీ నాడార్‌ మల్హోత్రా, సీఈవో, హెచ్‌సీఎల్‌
మా కమిట్‌మెంట్‌ను అందరూ చూడండి. అందమైన అమరావతిలో అంతే అందమైన క్యాంప్‌సను ఏర్పాటు చేస్తున్నాం. స్థానికంగా చాలా టాలెంట్‌ ఉంది. వారి టాలెంట్‌కు మరింత మెరుగులు దిద్దుతాం. మీ నైపుణ్యాన్ని వెలికితీయండి. ఇక్కడి స్థానికులు వేరే రాష్ర్టాలలో పనిచేస్తున్నందున కమ్‌ బ్యాక్‌ హోమ్‌ నినాదంతో ముందుకు వెళుతున్నాం. లోకల్‌ టాలెంట్‌ అంతా ఇక్కడే ఉండాలన్నది మా అభిమతం.

అద్భుతం.. హెచ్‌సీఎల్‌ డిజైన్స్‌
కేసరపల్లిలో ఏర్పాటు చేయనున్న హెచ్‌సీఎల్‌ సంస్థ క్యాంపస్‌ ఆర్కిటెక్చర్‌ చిత్రాలను ఈ సందర్భంగా ఆ సంస్థ విడుదల చేసింది. దీనికి సంబంధించిన ట్రైలర్‌ను కూడా ప్రదర్శించారు. జీ+6 విధానంలో నాలుగు భవన సముదాయ శ్రేణిలో నిర్మిస్తున్నారు. పూర్తిగా పచ్చదనంతో కూడిన వాతావరణంలో ఆహ్లాదకరంగా క్యాంప్‌సను తీర్చిదిద్దనున్నారు. భవన సముదాయాల మధ్య ల్యాండ్‌ స్కేపింగ్‌, ఇంటీరియర్‌ వినూత్నంగా ఉంటుంది. ట్రెయినింగ్‌ సెంటర్‌లో సౌకర్యాలు కల్పిస్తున్నారు.


   it