బీఎడ్‌లు అర్హులే...‘టెట్‌’ పేపర్‌-1కు 

Header Banner

బీఎడ్‌లు అర్హులే...‘టెట్‌’ పేపర్‌-1కు 

  Wed Oct 10, 2018 07:14        APNRT, అమరావతి కబుర్లు, Education, Telugu


పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు
అమరావతి : టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(టెట్‌) పేపర్‌-1 రాసేందుకు బీఎడ్‌ అభ్యర్థులు కూడా అర్హులేనని విద్యాశాఖ ప్రకటించింది. దీంతో ప్రాథమిక పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకూ బోధించే ఉపాధ్యాయులుగా పనిచేసేందుకు వీరికీ అవకాశం లభించింది. ఈ మేరకు టెట్‌ మార్గదర్శకాలకు సవరణ చేస్తూ పాఠశాల విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం.. టెట్‌ పేపర్‌-1 రాసేందుకు.. కనీసం 50ు మార్కులతో ఇంటర్మీడియెట్‌ పూర్తిచేసి ఉండాలి. అదే ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులైతే 45% మార్కులతో పూర్తిచేసి ఉండాలి. ఇంటర్‌తో పాటు రెండేళ్ల డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌(లేదా) నాలుగేళ్ల బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌(లేదా) రెండేళ్ల డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషన్‌(స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) చేసి ఉండాలి. వీరితో పాటు బీఎడ్‌ కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులు కూడా అర్హులే. అదేవిధంగా.. 2010 ఆగస్టు 23 నాటి ఎన్‌సీటీఈ నోటిఫికేషన్‌కు ముందుగా.. డీఎల్‌ఈడీ లేదా డీఈడీ కోర్సులో పాసైన లేదా అడ్మిట్‌ అయిన అభ్యర్థులు కూడా అర్హులే. బీఎడ్‌ అభ్యర్థులు కూడా ఎస్‌జీటీ పోస్టులకు అర్హులే అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, అనంతరం కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మేరకు సవరణ ఉత్తర్వులు ఇచ్చింది.


   education