విజ‌యాల‌ను చేకూర్చే దుర్గామాత‌

Header Banner

విజ‌యాల‌ను చేకూర్చే దుర్గామాత‌

  Fri Oct 12, 2018 14:58        APNRT, Associations, Auto, అమరావతి కబుర్లు, Devotional, India, Telugu, World


మనుషులతోపాటు సకల జీవరాశులు, ఔషధీ సంపదలు నెలకొనిఉన్న ఈ భూమండలాన్ని అమితంగా ప్రభావితం చేస్తున్నవాడు చంద్రుడు. ఆ చంద్రుడి కాంతి స్వచ్ఛంగా, స్పష్టంగా ప్రసరించే కాలం శరదృతువు. చంద్రుడి దినదినాభివృద్ధిని సూచించేది శుక్లపక్షం, చంద్రుడి దినదిన క్షీణతను తెలిపేది కృష్ణపక్షం. మనిషి దినదినాభివృద్ధిని కోరుకుంటూ శుక్లపక్షాన్ని ఇష్టపడతాడు. అందుకే శరదృతువులోని శుక్లపక్ష పాడ్యమి నుంచి మహానవమి వరకు మనిషి చేసే శక్తి ఉపాసనలే శరన్నవరాత్రోత్సవాలుగా ప్రసిద్ధి చెందాయి.
భూమండలంతో కలుపుకొని ఈ విశ్వాన్ని నడుపుతున్నది ఒక మహాశక్తి. ఆ శక్తి ప్రభావం వల్లనే సృష్టి, స్థితి, లయాలు జరుగుతున్నాయి. శక్తి లేనిదే ఈ విశ్వం మనుగడ సాగించలేదు.
ఏ దివ్యరూపం సకల ప్రాణికోటిలోనూ పంచభూతాలలోనూ శక్తిగా పరిణమించి ఈ విశ్వాన్ని నడుపుతున్నదో ఆ శక్తికి కృతజ్ఞతగా నమస్కరించాలని సంప్రదాయం చెబుతున్నది. అలా ప్రారంభమైనవే శరన్నవరాత్రోత్సవాలు. ఈ ఉత్సవాల్లో ఆ దివ్యశక్తిని మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనే మూడు రూపాలతో కొలవడం ఆచారంగా మారింది. మహాకాళి కాలానికి ప్రతిరూపం. మహాలక్ష్మి సకల సంపదలకూ పర్యాయపదం. మహాసరస్వతి జ్ఞానానికి నెలవు. మనిషి తన జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలంటే ఈ మూడు శక్తులనూ ప్రసన్నం చేసుకోవడం అనివార్యమని మహర్షుల ఉపదేశం. శరన్నవరాత్రోత్సవాల్లో ఈ మూడు శక్తుల ఆరాధన ప్రధానంగా కనబడుతుంది.
మానవ శరీరంలో కిందినుంచి పైదాక ఆరు చక్రాలుంటాయని యోగశాస్త్రం చెబుతోంది. వాటినే షట్‌ చక్రాలని పిలుస్తారు. మూలాధారం, స్వాధిష్ఠానం, మణిపూరం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ అనేవి ఆరు చక్రాలు. ఒక్కొక్క చక్రంలో ఒక్కో పద్మం ఉంటుందని శాస్త్రం చెబుతోంది. మనిషి యోగ సాధన ద్వారా ఒక్కొక్క చక్రంలో ఉన్న పద్మాన్ని వికసింపజేస్తూ శిరస్సులో ఉండే సహస్రారకమలం (వేయి రేకుల పద్మం) దాకా చేరుకుంటే అది విచ్చుకొంటుందని, ఆ కమలం నుంచి మకరందామృతం ధారలా శరీరమంతా ప్రవహిస్తుందని, అప్పుడు మనిషి అజరామరుడు (ముసలితనంలేని నిత్య యౌవనంతో, మరణం లేనివాడుగా) అవుతాడని శాస్త్రం చెబుతోంది. ఇలా నేలపై నుంచి నింగిదాకా వ్యాపించిన ఆరుచక్రాలతో కూడిందే శ్రీచక్రం. శ్రీచక్రం దివ్యశక్తికి ప్రతీక. ఈ చక్రంలోని ఉన్నతస్థానంలోని బైందవస్థానం (బిందువు వంటి పీఠం)పై పరమేశ్వరి (ఈ ప్రపంచాన్ని నడుపుతున్న దివ్యశక్తి) ఉంటుందని శాక్తతంత్రాలు చెబుతున్నాయి. ఆ శక్తిని శరదృతువు ఆరంభంలోని పాడ్యమి మొదలుకొని తొమ్మిదిరాత్రులు పూర్తి అయ్యేంతవరకు అర్చించడమే శరన్నవరాత్రోత్సవాల ప్రత్యేకత. అందుకే ఆ శక్తిని చంద్ర కళారూపిణిగా కొలవడం పరిపాటిగా మారింది. రోజుకొక్క కళగా వర్ధిల్లే ఈ చంద్రకళ మహానవమినాడు ఉజ్జ్వలంగా ప్రకాశిస్తుంది. నవశబ్దం నిత్యనూతనత్వాన్ని సూచిస్తుంది. కనుక మనిషి తాను ఆజీవనపర్యంతం నిత్యనూతనంగా ఉండాలనే ఆశయంతో నవరాత్రోత్సవాలను ఆచరిస్తాడు. ఇలా నిత్య నూతనోత్సాహంతో తొమ్మిది రాత్రులు చేసే అర్చనకు ఫలంగా పదోరోజు విజయదశమి ఆవిర్భవిస్తుంది. ఈ పర్వదినాన ఏ నూతన ప్రయత్నం చేసినా అది శుభదాయకం అవుతుందని, లాభాలను ప్రసాదిస్తుందని జనుల నమ్మకం. విజయ దశమి నాడు ‘అపరాజిత’ అనే దివ్యశక్తి ఆవహించి ఉంటుందని, ఆ శక్తి మనిషికి అపజయాలులేని పురోగతిని ప్రసాదిస్తుందని ప్రగాఢ విశ్వాసం.
మనిషి తన జీవితాన్ని దినదినాభ్యుదయంగా రూపొందించుకోవడానికి ఇష్టపడతాడు. శుక్లపక్షంలోని పాడ్యమినుంచి పూర్ణిమదాకా రోజుకొక్క కళ ఎలా వృద్ధిచెందుతుందో అలాగే తన జీవితం వికసించి, మూడు పూవులు, ఆరుకాయలు కావాలనుకోవడమే శరన్నవరాత్రోత్సవ పూజా పరమార్థం. అందుకే ఇవి నవరాత్రులు కావు... నవరత్నాలే!   durga